Tuesday, 25 October 2016

గజల్..1136..
మరణమంటె ఏమున్నది తోటగేటు మూసినట్లు..!
పుట్టుకంటె బ్రతుకువిలువ తెలియ మరలినట్లు..!
బాధపెట్టు బాధుండదు నీవు కోరి పడకుండా..
మనిషంటే చిరునవ్వుల చెట్టు మొగ్గ తొడిగినట్లు..!
ప్రాణమెంత తియ్యనిదో పోతుంటే తెలుస్తుంది..
పూవు త్రెంచ కన్నబిడ్డ గొంతు పట్టి నరికినట్లు..!
యుద్ధనీతి కోవిదులకు వేదాంతం చెప్పడమా..?!
భయపడితే నీకు నీవు మంటలలో దూకినట్లు..!
మిసైలేమి చేయగలదు మౌనం విస్పోటిస్తే..
సరిహద్దుల నాటకాల వేదికలను పేల్చినట్లు..!
మాధవుడా..సాక్షిలాగ నిలచు విద్య నేర్వవేమి..!?
చెలిమిగుట్టు పట్టకుంటె నీడలతో పోరినట్లు..!

Sunday, 23 October 2016

గజల్..1132.
మదిలోన తడిసేటి వలపొకటి కావాలి..!
ముద్దుగా మిగిలేటి గజలొకటి కావాలి..!
గజలియత్ పట్టేది !?..ఏ షేరులోనైన..
ప్రేయసికి నచ్చేటి షేరొకటి కావాలి..!
నా మదికి వెన్నెలతొ అవసరం లేదసలు..
తన నవ్వు కురిసేటి మెరుపొకటి కావాలి..!
చీకటిని ప్రేమించు నెలవంకె నా చెలియ..
గగనాలు చేరేటి కిటుకొకటి కావాలి..!
బహుమతిగ మనసిచ్చు ముచ్చటే తెలియదే..
చెలిమితో బ్రతికేటి వరమొకటి కావాలి..!
ప్రేమకే చితిపేర్చు చేతులకు మొక్కాలి..
సత్యమును అందేటి చూపొకటి కావాలి..!
కలహించు భావనే విషమంటె తప్పేమొ..
అమృతము పంచేటి తలపొకటి కావాలి..!
మాధవా కాస్తంత నిలువరా నా ముందు..
నీ పదమె పట్టేటి వెలుగొకటి కావాలి..!





Tuesday, 11 October 2016

398..
ఓపిక పడుతున్నావా..ఒత్తిడెంతొ ఉంది లోన..!
పైకి నవ్వుతున్నావా..అలజడెంతొ ఉంది లోన..!
అద్దమల్లె ఉన్నానని..పలుకనేల స్నేహితుడా..!
పాఠం అనుకున్నావా..గడబిడెంతొ ఉంది లోన..!
అందంగా ఉన్నదనీ..ముద్దు నిప్పు కిస్తామా..!
ముచ్చట పడుతున్నావా..గారడెంతొ ఉంది లోన..!
చిత్రమైన మనసు తోట ఆడుకున్న ఆట లెన్నొ..?!
నీడన పడుకున్నావా..ఆరడెంతొ ఉంది లోన..!
లేని పోని కలల జలధి సాక్షి మాట మరి ఏమిటి..?!
నిలిచి చూసుకున్నావా..ఉరవడెంతొ ఉంది లోన..!
'మాధవు'నకు..తెలియదేమి..కానకుండు ననుకోకు..!
తెలిసి అందుకున్నావా..సందడెంతొ ఉంది లోన..!

Sunday, 9 October 2016



1096.
ఎన్ని పుటలు నింపానో.. మంచుపూల వెన్నెలలో..!
ఎన్ని సార్లు తడిశానో..వలపుపూల వెన్నెలలో..!

కాల్చినావు చూపులతో..నా తలపుల చీకట్లను..
ఎన్ని కథలు విన్నానో..పలుకుపూల వెన్నెలలో..!

రగులుతున్న విరహాలను..బుజ్జగించి మాన్పినావు..
ఎన్ని సుధలు పొందానో..సొగసుపూల వెన్నెలలో..!

నిన్నలెన్నొ నేటిమాటు మునిగినాయి నీ మహిమన..
ఎన్ని కలలు కన్నానో..ముద్దుపూల వెన్నెలలో..!

 మాటలడు అక్షరాలు..సాక్షులైన పక్షులాయె..
ఎన్ని ఏళ్ళు గడిపానో..మనసుపూల వెన్నెలలో..!

ఈ మాధవ గీతాలను..విను జాణగ మిగిలినాను..
ఎన్ని సుడులు తిరిగానో..గజలుపూల వెన్నెలలో..!




Saturday, 8 October 2016

తెలుగు గజల్..999




999..


వేదాంతపు కడలి కదా నీ తలపే ఓ సఖియా..!
జాబిలింటి మధువు కదా నీ సొగసే ఓ సఖియా..!

మైమరపును మరపించిన నవ్వు నీది మరువజాల..
మరుల సిరుల వాడ కదా..నీ ఊసే ఓ సఖియా..!

నీ పెదవుల ముద్దాడే పదవిగాక వేరెందుకు..
ఎదవీణియ ధార కదా..నీ వలపే ఓ సఖియా..!

ఈ రాతిరి మందారం..మౌనమేల పూనిందో..
శిలల కలల పాట కదా..నీ చూపే ఓ సఖియా..!

అలల పాద ముద్రలలో..సుతిమెత్తని నీ కురులే..
చెలిమిపూల తేనె కదా..నీ ధ్యాసే ఓ సఖియా..!

గజల్ వనం చూపినావు మాధవునకు విశ్రమింప..
పసిడి వెలుగు ఊట కదా..నీ శ్వాసే ఓ సఖియా..!